Thursday, April 20, 2017

37 కామ ’దహనం’

12 మార్చి 2017
’దుర్ముఖ’ ఫాల్గుణ పౌర్ణమి
37 కామ ’దహనం’

వడి వడి గా ముందుకు సాగుతున్న
బస్సు అద్దాల సందుల్లోంచి వీస్తున్న చల్ల గాలి........
పిల్లగాలై తుంటరి గా
ఈ ఒంటరి బాటసారి ని
ఇబ్బంది పెడుతున్న వేళ
పండు వెన్నెల నిండుగా కురుస్తున్న
ఈ పున్నమి వేళ
తన ఎడబాటు తో నిదుర కరవై
నిస్సహాయుడనై
నేను చేస్తున్న ఒంటరి పయనం
బాగుంది
ఎంతో బాగుంది.......
తన గురించి ఎడతెగని
ఈ ఆలోచనా ఝరి
ఆగినా కొనసాగినా
ఆనందమే........

కామ ’దహనం’ నాటి రాత్రి బస్సులో తిరుపతి నుండి హైదరాబాదు కు వెళుతూ........

Saturday, September 10, 2016

36 మృత్యోర్మా అమృతం గమయా

36 మృత్యోర్మా అమృతం గమయా
(Oh God! lead not towards the fear of death, instead lead me towards immortality)
1 sep 2016

ఒక జీవనయానం 
తుది మజిలీ కి చేరుకుంది 
అలసిన జ్ఞాన, కర్మేంద్రియాలు
శాశ్వత విశ్రాంతి ని కోరుకున్నాయి 
పెనవేసుకున్న బంధాలు అనుబంధాలు 
అర్థాంతరంగా ఆగిపోయాయి 
మరొక ఉన్నత వస్త్రం కోసం ఆరాటపడుతున్న ఆత్మ 
మరిక సెలవు అంది 
విముక్తి ని కోరుకుంది 
అనంత వాయువుల్లోకి 
'వాయు సేన'*** కవాతు మొదలయ్యింది
జాతస్య హిధ్రువో మృత్యుః...... 

***
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన  అని పంచ వాయువులు 
నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయ అని పంచ ఉప వాయువుల తోడ్పాటు తో శరీరం లో ని పలు భాగాలు పని చేస్తాయి. అంత్య కాలము లో ఇవి ఒక్కొక్కటి గా శరీరాన్ని వీడతాయి.  

(31 aug 2016 రాత్రి సుమారు 2గం 30 నిII కు వెంకట లక్షుమ్మత్త తుది శ్వాస వీడిందన్న వార్త 1 sep 2016 ఉదయం 7 గం II  కు నాన్న ద్వారా ఫోన్ లో తెలుసుకుని....... ) 




Sunday, January 10, 2016

35. ప్రణవ నాదం



35. ప్రణవ నాదం 
ఉషః కాలపు చిరు చీకట్లు 
తొలగిపోతున్న వేళ 
నీలాల నింగిలో 
ఎఱ్ఱని చారలు 

తూరుపు కొండలను ఒరుసుకుంటూ 
పై పై కి ఎగ బాకుతున్న 
ఎఱ్ఱటి సూరీడి 
నులి వెచ్చని కిరణాలు సోకి 
మార్గశిరపు మంచు దుప్పటి 
కరిగిపోతున్న వేళ 
ఆనందం తో పక్షుల 
కిల కిలా రావాల ప్రణవం ......... 


(10 జనవరి 2015 - బస్సు లో తిరుపతి వెళుతూ ...) 
శుభోదయం 

Sunday, April 12, 2015

034 అందమే ఆనందం

12 April 2015
’మన్మథ’ చై బ అష్టమి

అందమే ఆనందం

మండు వేసవి
ఎండలు తాళ లేక
సూరీడు సెలవు పెట్టాడు
సకాలంలో బాధ్యతలు
చేపట్టిన వరుణుడు
జోరుగా అకాల వర్షాలు కురిపించేశాడు
ప్రకృతి లయ తప్పినా
అందమే.....
ఆనందమే.........



Sunday, December 7, 2014

033 అందమైన వెన్నెల లోన

అందమైన వెన్నెల లోన


ఆలోచనా భారం తో అలసిన 
శనివారపు సంధ్య వేళ ,
నిండు పున్నమి జాబిలి
గిలిగింతల చలి గాలి 
నను సేద తీర్చాయి 
తల్లి ఒడిలో 
చంటి పిల్లాడిలా 
ప్రకృతి మాత ఒడిలో 
ఒదిగిపోతూ 
పరవశిస్తూ 
మైమరచిపోతూ ....... 
నేను. 

06 డిసెంబర్ 2014 -  కాలేజి నుండి ఇంటి కి వస్తూ నిండు పున్నమి చంద్రుడి ని చూచినా పారవశ్యం లో ...........  

Sunday, October 12, 2014

032 శరదభ్రం

                                                                    8 Oct 2014, 7:00PM
                                                                   ‘’జయ’ ఆశ్వీయుజ పౌర్ణమి
                                                                    చంద్ర గ్రహణం వేళ కాలేజి నుండి ఇంటి కి వస్తూ.....
                                                  

శరదభ్రం

చంద్ర గ్రహణం
మనసు స్తంభించింది
గ్రహణం ముగిసింది
పరవళ్ళు తొక్కింది ఆలోచనా ఝరి
శరత్కాలపు వినీలాకాశంలో
మేఘాల విన్యాసం
మబ్బు చాటున చంద్రుడు
మబ్బుల ఱేడు దాగినా అందమే !!!
నిండు పున్నమి జాబిలి
కురిపిస్తున్న వెన్నెల వర్షం లో
చకోర పక్షినై ఓలలాడుతున్న వేళ
మనసు చంద్రుడి లో లీనమై
ఆ అద్వైత స్థితిలో
ఆ పారవశ్యంలో
ఆలోచన ఆగిపోయింది
మనసు స్తంభించింది.......




Monday, July 28, 2014

031 పరవశం


031 పరవశం
మబ్బు మురిసింది
వర్షం కురిసింది
పుడమి పులకించింది
మట్టి వాసన గుబాళించింది
నెమలి నాట్యమాడింది
ఆనంద తాండవమాడుతున్న ప్రకృతి
తాదాత్మ్యతతో రమిస్తోంది
ఈ పురుషుడు ఆ ప్రకృతి తో
మమేకమవుతున్నాడు
ఆనందం !
పరమానందం !!
నిరతిశాయానందం !!!


'జయ' శ్రావణ శుక్ల పాడ్యమి
27July2014
వీణ Birthday