Monday, January 13, 2014

024 అద్వైతం


అద్వైతం
కన్ను , కను రెప్ప
అద్వైతం కోరుతున్న వేళ

నీ చిలిపి తలపు
నిద్ర ని దూరం చేయగా

పారవశ్యం
బాగుంది....
ఎంతో బాగుంది...




023 గమ్మత్తు

24Dec2013 Tpty to Hyd – Garuda plus
నీ పలుకుల ని లో
రాగం దాగుందో?

నా మది కి ఒక
సాంత్వన దొరికింది

నీ పిలుపుల
మధురిమ లో
గమ్మత్తుందో?

ఏదో తెలియని
మత్తు నన్నావహించింది!!!


022 బాగుంది........

15Dec2013 Tpty – Hyd_ Garuda bus
బాగుంది........

మదిని ముంచెత్తిన
నీ ఆలోచనలు

కంటికి కనురెప్పను
దూరం చేయగా

నిదుర చెదరి
కలలు కరువైన

విరహం
బాగుంది
ఎంతో బాగుంది......



021 జోహార్!

13 – 12 – 13, Railway Kodur (on the way to Tirupati)

జోహార్!

చిరు జల్లు నింపిన
నూతనోత్సాహం

కాడెద్దుల తో
సేద్యం చేస్తున్న
కర్షకుడా!

నేటి నీ శ్రమ ఫలం
రేపటి నా తిండికి మూలం!
జోహార్! జోహార్!! జోహార్!!!



020 చిరు జల్లు

13Dec13 Railway koduru – in the bus to tirupati
చిరు జల్లులతో
తడిచిన ప్రకృతి
కాంత పచ్చని
దేహం
మిసమిసలాడుతోంది
క్రొంగొత్త అందాలతో;

తన అందాన్ని
దాచే ప్రయత్నం
కాబోలు
పొగ మంచుని
చేసుకుంది పైటగా!



019 ఆనందం !!!


ఆనందం !!!


ఒక ఆహ్లాద నిశీధి వేళ 
ఏకాంతములో 
తన పెదవి పై 
విరిసిన చిరునవ్వు కి 
ఒక చిలిపి కారణం 
నేనని తెలిసీ ....... 


018 చిలిపి చిరుగాలి

                                                                                18 చిలిపి చిరుగాలి

ప్రియురాలి ఊసులని
ప్రియుడి వద్దకి
మోసుకెళ్తుందో తెలియదు కానీ...
గాలి
మహా తొందరపడుతోంది!

రహస్యాలు చాలా
ఉన్నాయేమో......
గుసగుసల సవ్వడులతో
తెగ పరుగు తీస్తోంది!!





Wednesday, January 1, 2014

017 marO mUdu kavithalu....

తెలవారుతోంది
కొబ్బరి ఆకుల మాటున
అరుణ బింబం
ప్రకృతి కాంత నుదుటిన
తిలకంతో దోబూచులాడుతున్న
ముంగురులేమో!!!


చైత్ర నిశీధి లో
ఒంటరి పయనం
గ్రీష్మాన్ని తలపిస్తున్న
వసంతం
ఈ తాపం
బాహ్యమా? లేక ఆంతరమా?
తెలియని సందిగ్ధం!!!



అమావాస్య - ఆకాశంలో పవర్ కట్
’నక్షత్రం’ బ్రాండ్ క్రొవ్వొత్తులను
విరివిగా వెలిగించిన
పురుషుడెవరో!!!



016 వెన్నెల విహారం

వెన్నెల విహారం

పున్నమి రేయి
పండు వెన్నెల లో
కబుర్లు చెబుతూ విహరిద్దామని
నీతో కలసి వస్తే.....
మన ఏకాంతానికి
భంగం కలుగకూడదన్న
మంచితనం కాబోలు
మబ్బు చాటుకి వెళ్ళాడు
చందమామ.
తనని గుర్తెరుగక
మోహ పరవశంతో
మైమరచి
నిను చూస్తున్నానని
అలిగాడేమో?




015 ఒక దీర్ఘాలోచన

6 May 2013
ఒక దీర్ఘాలోచనలో మునిగిపోయిన నేను
చల్ల గాలికి వయ్యారాలు పోతున్న
ముంగురుల కితకితల కి
తటాలున ఈ లోకం లోకి వచ్చాను
నా నుదుటి పై ఇంతసేపు
నాట్యమాడింది
నీ మెత్తని మునివేళ్ళేమో యని
చుట్టూ పరికించాను.
నీవు లేవని తెలిసి
అందమైన భ్రమ పైకి

ఒక చిరునవ్వు రువ్వాను. 

014. చిన్నీ నా ముక్కు లోని చీమిడా ఎంత పని చేస్తివే

14. చిన్నీ నా ముక్కు లోని చీమిడా ఎంత పని చేస్తివే
22 Jan 2013
పిల్ల గాలి కరవైందని
చల్ల గాలి కి పోదమని
చెంగున నే బయటికొస్తే
మంచు రూపంలో, పొగ మంచు రూపంలో
నాలంగ్సునన్దూరి
వెచ్చని నీడ దొరికిందని
మారాము సేయక
కాసేపు విశ్రమించి వెనుదిరిగి పోక,
గళ్ళ అనీ, చీమిడి అనీ,
వివిధ రూపాల్ ధరించి
నా శరీరమున ఉష్ణమున్ పెంచి
అంతాటి విగ్రహాన్ని
అడ్డంగా పడగొడ్తివే!                                                               II చిన్నీ II
స్నానము సేయ శరీరము సహకరించక
నల్లని జుత్తునన్ కన్పించు
తెల్లని చుండ్రు పొలసుల గాంచి
ఘనవినీలాకాశంలో
తళుకులీను తారలు గదా !
అని మురిసిపోతి గదే ?                                                        II చిన్నీ II
అలనాడు నీ వోలె అల్పుడల్లె
అగుపించిన వామనుండు
బలిని ద్రొక్కెనంట పాతాళమునకు
నేను బలిని గాదె చీమిడీ
నన్ను బలి కోర వద్దే చీమిడీ
బుద్ధిగా మసలుకొందూనే
మంచూ, మంచూ, మంచూ జోలికి నేనెళ్ళనే
పిల్ల లేదు, చల్ల లేదు, అసలు గాలి ఊసే వద్దు

బుద్ధీ గా నడచుకొందూనే చీమిడీ                     II చిన్నీ II

013. కడిగిన ముత్యం


13. కడిగిన ముత్యం

దూరంగా......
భూమ్యాకాశాలు ఏకమయ్యే చోట
నల్లని చారలు.
చారలు కావవి
వర్షపు ధారలు.

ఆగిన వర్షం.
పయనం మొదలు పెట్టిన మేఘం
మబ్బు చాటు నుండి సూర్యుడు
బయటికి వచ్చాడు
కడిగిన ముత్యంలా............

(తిరుపతి నుండి నాయుడు పేట లోని మిత్రుడు నాగరాజు ఇంటికి వెళుతూ Bus లో నుండి కనిపించిన దృశ్యానికి స్పందన. స్పందన కి అక్షర రూపం, నెల్లూరు లో ని మరో మిత్రుడు వేణు ఇంట్లో...)



012. నేను ...........’నీ’గర్విని

12. నేను ...........’నీ’గర్విని

నీ అందమైన కనులను
కాపాడుతున్న కనురెప్పలను చూచి
నాకు అసూయ
అంత సామీప్యం నాకు లేనందుకు,
నీ పెదవులని చూచి
కూడా అదే భావన
సొగసైన చిరునవ్వుకు
సొంతదారు అయినందుకు.
గర్వించాను నేను
ఆ కనుపాపల నిండా
నేనున్నానని తెలిసి,
ఉప్పొంగాను నేను
ఆ చిరునవ్వు నా కోసం
విరబూసిందని తెలిసి.



011. ఓ వర్షం కురిసిన సాయంత్రం.......

11. వర్షం కురిసిన సాయంత్రం.......
నల్లని మబ్బులు
జోరున కురిపించిన వర్షం
నీవు నా పై కురిపించిన
ప్రేమ ముందు చిన్నబోయింది

గిలిగింతలు పెడుతూ
మెల్లగా వీచిన
చల్లటి గాలి
నీ వెచ్చటి ఊపిరిని ఎదిరించి
ఓడిపోయింది

శరీరాన్ని ఆవరించిన బడలిక
మనస్సుని ఆవరించిన నిరుత్సాహం
నీ చిరునవ్వుతో ఛిద్రమయ్యాయి

ప్రకృతి నీకు వశమైంది
పురుషుడు నీకు దాసోహమయ్యాడు

( సాయంత్రం చల్ల గాలిలో ఇంటికి వస్తున్నపిల్లవాడి కి వచ్చిన ఒక అందమైన ఊహ కి అక్షర రూపం)