Tuesday, December 31, 2013

010 స్నేహమే రా జీవితం

July 31, 2011
10 స్నేహమే రా జీవితం
సూక్తులు, సుభాషితాలు, సూచనలు, సలహాలు
అప్రతిహతంగా వెలువడుతున్నాయి
బయలు దేర వలసిన సమయం
ఆసన్నమైంది
మాటల ప్రవాహం మందగించింది
మనస్సు మూగదైన వేళ
కళ్ళు మౌనంగా మాట్లాడుకున్నాయి
పర్యవసానం
ఒక కరచాలనం,
ఒక చిరు కౌగిలి
అయిష్టంగానే చేయి వీడుకోలు పలికింది

బాధ్యత పరుగిడమంటోంది
బంధం ఆగమంటోంది
రెండింటికీ రాజీ కుదర్చలేక
భారంగా వాడు అడుగులు వేస్తుంటే...
ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరం
పెంచింది మనస్సులో ఉద్వేగం
మళ్ళీ వస్తాడన్న ఆనందమో
వదిలి వెళుతున్నాడన్న బాధో
తెలియదు కానీ
కంటి చివర చిన్న బాష్పం.
(ఆప్త మిత్రుడు కందాళం శ్రీకాంత్ దుబాయ్ పయనమవుతున్న వేళ shamshabad air port లో....)


009 మనసున మనసై

మనసున మనసై

వయ్యారాలు పోతూ పారుతున్న
పంట కాలువ
తనతో పోటీ పడుతూ
మరింత వయ్యారంగా గట్టున
నిలబడ్డ కొబ్బరి చెట్టు -
ఈ ఒంపు సొంపులు
నిన్ను పదే పదే జ్ఞప్తి కి తేగా,
ఎన్నో ఊసులు, మరెన్నో ముచ్చట్లు,
నీతో పంచుకోవాలని
మొదలెట్టాను పయనం.

కొబ్బరి ఆకుల చాటున
దోబూచులాడుతున్న దశమి చంద్రుడు
ఆ ఊసులన్నీ ముందుగా
తనకి చెప్పమని ప్రలోభ పెడుతూ
వెన్నెల తివాచీ  పరిచాడు
శీతల సమీరాన్ని సంధించాడు

నా మదిలో అంకురించిన
ఆలోచనలు మనో వేగం తో
ఎప్పుడో నిన్ను చేరుకొని ఉంటాయని
తెలియదు పాపం.

(నరసాపురం నుండి భాగ్య నగరాని కి తిరుగు పయనం లో - మార్గమధ్యం లో - పంట కాలువ ని, పండు వెన్నెల ని, చూచిన పరవశం లో పొంగుకొచ్చిన భావజాలాని కి భాషా రూపం. ఆస్వాదించి ఆదరించ గలరు.)


008 బంగారు పాపాయి

008 బంగారు పాపాయి

అది ఒకానొక గ్రీష్మ సంధ్య
పై కప్పు రంధ్రం నుండి
దినకర మయూఖ ప్రవేశం

నేలను ముద్దాడిన కిరణాన్ని
ఒడిసి పట్టుకోవాలని పాపాయి ప్రయత్నం

అమాయకత నిండిన చిన్నారి చేష్టలని చూచి
తల్లి మురిసింది
తండ్రి మోము పై చిరునవ్వు విరిసింది

007 ప్రకృతి - పురుషుడు


ప్రకృతి - పురుషుడు
తెల వారుతోంది
తూరుపున ప్రత్యక్ష నారాయణుడి
పయనం మొదలవబోతోంది
ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర...’ **
ఆకాశపు కాన్వాసు పై
మబ్బులని అందంగా అమర్చారు ఎవరో?.......
తుఫాను ముందరి ప్రశాంతత లాగా
వేసవి వడగాడ్పు కి ముందు
ఒక శీతల సమీరం
నన్ను ముద్దాడి వెళ్ళింది
దృశ్యాన్ని ఆస్వాదిస్తూ
లిప్త పాటు కనులు మూసి తెరిచాను.
ఉరకలెత్తించే నూతనోత్సాహం
నా వశమైంది.
ప్రకృతి కి, ప్రత్యక్ష నారాయణుడికి
ధన్యవాదములు.
** చిన్నప్పుడు రేడియో లో విన్న సూర్యాష్టకం


006 ఎవరి కోసం..............

ఎవరి కోసం..............

పున్నమి రాతిరి
నిండు చందమామ,
గ్రీష్మ తాపాన్ని మరిపిస్తూ
మంద్రంగా వీస్తున్న
చల్లటి గాలి,
మధ్యలో మారాం చేస్తున్నా
మంచి పాటలు వినిపిస్తున్న రేడియో,
ఎన్నో ఊసులు మరెన్నో చిలిపి ఆలోచనలు
నీతో పంచుకోవాలని చూస్తున్న తుంటరి బావ,
నీ రాక కోసం ఎదురు చూస్తూ...................






005 భాష్యం

భాష్యం

స్వాతి చినుకు
నీ మీద పడిందో కానీ
ముత్యంలాంటి మొటిమ ని
నీ ముఖం పై అమర్చింది
అందమైన గాయానికి
నేను తియ్యని మందు వేద్దామనుకుంటున్నాను
అనుమతి కోసం ఎదురుచూస్తున్నాను
అరమోడ్పు కన్నులు
అలాగే కానివ్వమన్నాయని నా మనసు.....
భాష్యం చెబుతోంది.


004 మౌనం శరణం గచ్ఛామి

మౌనం శరణం గచ్ఛామి

ఎన్నో భావాలు మరెన్నో ఆలోచనలు
పరస్పరం పోటీ పడుతున్నాయి
భాష కోసం ప్రాకులాడుతున్నాయి
భావ స్థాయి నుండి భాష స్థాయి కి
ఎదగటానికి తపిస్తున్నాయి
మధ్యమ దశ నుండి వైఖరి దశకి చేరుకోవటానికి ***
మదన పడుతున్నాయి
ఈ భావ సంగ్రామంలో
నిస్సహాయుడనై నేను
మౌనాన్ని ఆశ్రయించాను
చెలీ! నువ్వు రావాలి
ఈ తీగని సవరించాలి
నా మనసు కి మాట నేర్పాలి


*** వాక్కు కి నాలుగు రూపాలు - పరా, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి. వాయు పిండం గా మూలాధారం లో బయలుదేరిన ఆలోచన వెన్నుపూస ద్వారా పయనిస్తూ పరా, పశ్యంతి, మధ్యమ స్థితులను దాటుకుంటూ చివరకి శబ్ద రూపమైన వైఖరి స్థితి లో నోటి నుండి బయట కి వస్తుంది.ఉచ్చరించే ప్రతీ మాటా దశలను పూర్తి చేసుకు రావాలి. మంత్రాన్ని మధ్యమ స్థాయి లో నే ఆపేసి సాధన చేయటాన్ని మౌన జపం అంటారు.



003 నాకు ఒక తోడు కావాలి

నాకు ఒక తోడు కావాలి

నా వెచ్చటి కన్నీటి చుక్కని ఒడిసి పట్టుకునే ఒక దోసిలి కావాలి
నేనున్నానని భుజం తట్టే ఒక ఆత్మీయ స్పర్శ కావాలి
గాఢాలింగనంలో సేద తీర్చే ఒక చల్లని హృదయం కావాలి
నాలో ఉత్సాహం నింపే ఒక సుదీర్ఘ చుంబనం కావాలి
ఆత్మీయతను పంచే ఒక తోడు కావాలి
నాకు ఒక తోడు కావాలి

002 బంగారు తల్లి ..... బజ్జోరా కన్నా!!!

బంగారు తల్లి ..... బజ్జోరా కన్నా!!!

అలసిన మనసుకు
చందమామనై ఆహ్లాదాన్నిస్తాను.......

నిదుర చెదరిన కనులకు
కనురెప్పనై  పవళింప చేస్తాను.....

సొలసిన నీ శరీరాన్ని
జోలపాడి సేద తీరుస్తాను..........

బాధ్యతలతో బరువెక్కిన హృదయాన్ని
ప్రియవచనాలతో తేలిక పరుస్తాను...........

బంగారు తల్లి ..... బజ్జోరా కన్నా!!!




001 నీ కోపమ్ నాకు మోదమ్


నీ కోపమ్ నాకు మోదమ్

యెన్నో భావాలు పలికే
ఆ కంటి భాష నాకు తెలుసు,
కాదు నాకు మాత్రమే తెలుసు.
అనునిత్యం అభిమానాన్ని కురిపించే
ఆ కన్నుల్లో కోపమా?
అభిమానం ఆప్యాయతలతో తలపడి
ఓడిపోయింది - పాపం.
ఆ ప్రేమ సాగరంలో పడి మునకలేస్తూ
మైమరచిన క్షణం లో ఒక ఆలోచన
తానోడి నేను గెలిచానా? లేక
నేనోడి తను గెలిచిందా? - అని ఒక సన్దేహం
యేమో యేది యేమైనా
ఆ కోపం - నాకు మోదం