Tuesday, December 31, 2013

009 మనసున మనసై

మనసున మనసై

వయ్యారాలు పోతూ పారుతున్న
పంట కాలువ
తనతో పోటీ పడుతూ
మరింత వయ్యారంగా గట్టున
నిలబడ్డ కొబ్బరి చెట్టు -
ఈ ఒంపు సొంపులు
నిన్ను పదే పదే జ్ఞప్తి కి తేగా,
ఎన్నో ఊసులు, మరెన్నో ముచ్చట్లు,
నీతో పంచుకోవాలని
మొదలెట్టాను పయనం.

కొబ్బరి ఆకుల చాటున
దోబూచులాడుతున్న దశమి చంద్రుడు
ఆ ఊసులన్నీ ముందుగా
తనకి చెప్పమని ప్రలోభ పెడుతూ
వెన్నెల తివాచీ  పరిచాడు
శీతల సమీరాన్ని సంధించాడు

నా మదిలో అంకురించిన
ఆలోచనలు మనో వేగం తో
ఎప్పుడో నిన్ను చేరుకొని ఉంటాయని
తెలియదు పాపం.

(నరసాపురం నుండి భాగ్య నగరాని కి తిరుగు పయనం లో - మార్గమధ్యం లో - పంట కాలువ ని, పండు వెన్నెల ని, చూచిన పరవశం లో పొంగుకొచ్చిన భావజాలాని కి భాషా రూపం. ఆస్వాదించి ఆదరించ గలరు.)


No comments:

Post a Comment