Sunday, December 7, 2014

033 అందమైన వెన్నెల లోన

అందమైన వెన్నెల లోన


ఆలోచనా భారం తో అలసిన 
శనివారపు సంధ్య వేళ ,
నిండు పున్నమి జాబిలి
గిలిగింతల చలి గాలి 
నను సేద తీర్చాయి 
తల్లి ఒడిలో 
చంటి పిల్లాడిలా 
ప్రకృతి మాత ఒడిలో 
ఒదిగిపోతూ 
పరవశిస్తూ 
మైమరచిపోతూ ....... 
నేను. 

06 డిసెంబర్ 2014 -  కాలేజి నుండి ఇంటి కి వస్తూ నిండు పున్నమి చంద్రుడి ని చూచినా పారవశ్యం లో ...........  

Sunday, October 12, 2014

032 శరదభ్రం

                                                                    8 Oct 2014, 7:00PM
                                                                   ‘’జయ’ ఆశ్వీయుజ పౌర్ణమి
                                                                    చంద్ర గ్రహణం వేళ కాలేజి నుండి ఇంటి కి వస్తూ.....
                                                  

శరదభ్రం

చంద్ర గ్రహణం
మనసు స్తంభించింది
గ్రహణం ముగిసింది
పరవళ్ళు తొక్కింది ఆలోచనా ఝరి
శరత్కాలపు వినీలాకాశంలో
మేఘాల విన్యాసం
మబ్బు చాటున చంద్రుడు
మబ్బుల ఱేడు దాగినా అందమే !!!
నిండు పున్నమి జాబిలి
కురిపిస్తున్న వెన్నెల వర్షం లో
చకోర పక్షినై ఓలలాడుతున్న వేళ
మనసు చంద్రుడి లో లీనమై
ఆ అద్వైత స్థితిలో
ఆ పారవశ్యంలో
ఆలోచన ఆగిపోయింది
మనసు స్తంభించింది.......




Monday, July 28, 2014

031 పరవశం


031 పరవశం
మబ్బు మురిసింది
వర్షం కురిసింది
పుడమి పులకించింది
మట్టి వాసన గుబాళించింది
నెమలి నాట్యమాడింది
ఆనంద తాండవమాడుతున్న ప్రకృతి
తాదాత్మ్యతతో రమిస్తోంది
ఈ పురుషుడు ఆ ప్రకృతి తో
మమేకమవుతున్నాడు
ఆనందం !
పరమానందం !!
నిరతిశాయానందం !!!


'జయ' శ్రావణ శుక్ల పాడ్యమి
27July2014
వీణ Birthday

Sunday, July 13, 2014

030 పండు వెన్నెల

030 పండు వెన్నెల 

అందమైన నీ ఊహలలో 
విహరిస్తున్న నా మనస్సు కి 
ఈ వెన్నెల రేయి 
మరింత అందంగా అగుపించింది 

నా గుప్పెడు గుండె లో 
నిండుగా ఒదిగిన నీవు 
నాకే చోటు లేనంతగా 
నా హృదయ సామ్రాజ్యాన్ని 
ఆక్రమించుకోవడం 

బాగుంది...... 
ఎంతో బాగుంది..... 

12July2014

ఆషాడ పౌర్ణమి (గురు పౌర్ణమి) నాడు చందమామ ని పండు వెన్నెల ని ఆస్వాదిస్తూ....   

Monday, June 30, 2014

029 तन्हाई

29 तन्हाई 


ठंडी सी ये हवा में 

तन्हाई में घूमते हुए हम 

काश मेरी  मेहबूबा रहती 

नजदीक हमारी 

जन्नत को ठुकराते थे हम !

Saturday, April 26, 2014

028 అలసిన దేవేరి

028 అలసిన దేవేరి 


నిదుర దూరమైన 
ఈ ఒంటరి పయనం 

తనని పదే పదే జ్ఞప్తి కి తేగా ....... 

నిదుర మరింత 
కరవైన ఈ నిశి రాత్రి వేళ ......... 

నీలాల నింగి లోని 
ఓ చందమామ!

తననైనా కాస్త 
నిద్రపుచ్చవూ?..... 

Hyd to Tirupati_23April2014_2:20AM


(కలలలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేల్మంగకు ...... అన్న 'సిరివెన్నెల' వారి శృతి లయలు పాట స్ఫూర్తి తో ఒక చిన్న కవిత) 

Tuesday, March 11, 2014

027 ఈ జాబిలి ... ఈ వెన్నెల.....

ఈ జాబిలి ... ఈ వెన్నెల.....



రాముడి వర్ణం
పులుముకున్న ఆకాశం

నేటికి సూర్యుడిని
సాగనంపింది (సూర్యాస్తమయం)

అల్లరి ఆలోచనలు
రేపే తుంటరి చందమామ
వచ్చే వేళయ్యింది

నా హృదయ సామ్రాజ్య
పట్ట మహిషి నుండి
దూరంగా వెళుతున్న నేను

వెన్నెల రేడు తో
ఈ రాత్రి
ఎలా వేగాలో ......?

Mbnr to Sec'bad - Thungabhadra express - 09March2014 - 6:15PM 

026 ఒంటరి పయనం

ఒంటరి పయనం


లేత నీలం నుండి
మెల్లగా మెల మెల్లగా
ముదురు నీలం లోకి
మారుతున్న ఆకాశం

నా ఆలోచనలని కూడా
అలా మారుస్తున్న వేళ

తనని వీడి చేస్తున్న
ఒంటరి పయనం......

తననుండి దూరంగా వెళుతున్న కొద్దీ

ఆలోచనల నిండా తనని నింపుకుని
మానసికంగా మరింత చేరువవుతూ ......

ఏకమవుతూ....
మమేకమవుతూ

చేస్తున్న
ఒంటరి పయనం

బాగుంది
ఎంతో బాగుంది ......

Mahaboobnagar to Secunderabad - Thungabhadra express - 28Feb2014 - 6:32PM

025 చెలి నగు మోము

చెలి నగు మోము



(కృష్ణ) చవితి నాటి 
చందమామని చూస్తే .....

కొంగు చాటున 
తన మొహంలా 
అనిపించిందేమో?

మరింత అందంగా
కనిపించింది!!



-- 
Vamsi

Monday, January 13, 2014

024 అద్వైతం


అద్వైతం
కన్ను , కను రెప్ప
అద్వైతం కోరుతున్న వేళ

నీ చిలిపి తలపు
నిద్ర ని దూరం చేయగా

పారవశ్యం
బాగుంది....
ఎంతో బాగుంది...




023 గమ్మత్తు

24Dec2013 Tpty to Hyd – Garuda plus
నీ పలుకుల ని లో
రాగం దాగుందో?

నా మది కి ఒక
సాంత్వన దొరికింది

నీ పిలుపుల
మధురిమ లో
గమ్మత్తుందో?

ఏదో తెలియని
మత్తు నన్నావహించింది!!!


022 బాగుంది........

15Dec2013 Tpty – Hyd_ Garuda bus
బాగుంది........

మదిని ముంచెత్తిన
నీ ఆలోచనలు

కంటికి కనురెప్పను
దూరం చేయగా

నిదుర చెదరి
కలలు కరువైన

విరహం
బాగుంది
ఎంతో బాగుంది......



021 జోహార్!

13 – 12 – 13, Railway Kodur (on the way to Tirupati)

జోహార్!

చిరు జల్లు నింపిన
నూతనోత్సాహం

కాడెద్దుల తో
సేద్యం చేస్తున్న
కర్షకుడా!

నేటి నీ శ్రమ ఫలం
రేపటి నా తిండికి మూలం!
జోహార్! జోహార్!! జోహార్!!!



020 చిరు జల్లు

13Dec13 Railway koduru – in the bus to tirupati
చిరు జల్లులతో
తడిచిన ప్రకృతి
కాంత పచ్చని
దేహం
మిసమిసలాడుతోంది
క్రొంగొత్త అందాలతో;

తన అందాన్ని
దాచే ప్రయత్నం
కాబోలు
పొగ మంచుని
చేసుకుంది పైటగా!



019 ఆనందం !!!


ఆనందం !!!


ఒక ఆహ్లాద నిశీధి వేళ 
ఏకాంతములో 
తన పెదవి పై 
విరిసిన చిరునవ్వు కి 
ఒక చిలిపి కారణం 
నేనని తెలిసీ ....... 


018 చిలిపి చిరుగాలి

                                                                                18 చిలిపి చిరుగాలి

ప్రియురాలి ఊసులని
ప్రియుడి వద్దకి
మోసుకెళ్తుందో తెలియదు కానీ...
గాలి
మహా తొందరపడుతోంది!

రహస్యాలు చాలా
ఉన్నాయేమో......
గుసగుసల సవ్వడులతో
తెగ పరుగు తీస్తోంది!!





Wednesday, January 1, 2014

017 marO mUdu kavithalu....

తెలవారుతోంది
కొబ్బరి ఆకుల మాటున
అరుణ బింబం
ప్రకృతి కాంత నుదుటిన
తిలకంతో దోబూచులాడుతున్న
ముంగురులేమో!!!


చైత్ర నిశీధి లో
ఒంటరి పయనం
గ్రీష్మాన్ని తలపిస్తున్న
వసంతం
ఈ తాపం
బాహ్యమా? లేక ఆంతరమా?
తెలియని సందిగ్ధం!!!



అమావాస్య - ఆకాశంలో పవర్ కట్
’నక్షత్రం’ బ్రాండ్ క్రొవ్వొత్తులను
విరివిగా వెలిగించిన
పురుషుడెవరో!!!



016 వెన్నెల విహారం

వెన్నెల విహారం

పున్నమి రేయి
పండు వెన్నెల లో
కబుర్లు చెబుతూ విహరిద్దామని
నీతో కలసి వస్తే.....
మన ఏకాంతానికి
భంగం కలుగకూడదన్న
మంచితనం కాబోలు
మబ్బు చాటుకి వెళ్ళాడు
చందమామ.
తనని గుర్తెరుగక
మోహ పరవశంతో
మైమరచి
నిను చూస్తున్నానని
అలిగాడేమో?




015 ఒక దీర్ఘాలోచన

6 May 2013
ఒక దీర్ఘాలోచనలో మునిగిపోయిన నేను
చల్ల గాలికి వయ్యారాలు పోతున్న
ముంగురుల కితకితల కి
తటాలున ఈ లోకం లోకి వచ్చాను
నా నుదుటి పై ఇంతసేపు
నాట్యమాడింది
నీ మెత్తని మునివేళ్ళేమో యని
చుట్టూ పరికించాను.
నీవు లేవని తెలిసి
అందమైన భ్రమ పైకి

ఒక చిరునవ్వు రువ్వాను. 

014. చిన్నీ నా ముక్కు లోని చీమిడా ఎంత పని చేస్తివే

14. చిన్నీ నా ముక్కు లోని చీమిడా ఎంత పని చేస్తివే
22 Jan 2013
పిల్ల గాలి కరవైందని
చల్ల గాలి కి పోదమని
చెంగున నే బయటికొస్తే
మంచు రూపంలో, పొగ మంచు రూపంలో
నాలంగ్సునన్దూరి
వెచ్చని నీడ దొరికిందని
మారాము సేయక
కాసేపు విశ్రమించి వెనుదిరిగి పోక,
గళ్ళ అనీ, చీమిడి అనీ,
వివిధ రూపాల్ ధరించి
నా శరీరమున ఉష్ణమున్ పెంచి
అంతాటి విగ్రహాన్ని
అడ్డంగా పడగొడ్తివే!                                                               II చిన్నీ II
స్నానము సేయ శరీరము సహకరించక
నల్లని జుత్తునన్ కన్పించు
తెల్లని చుండ్రు పొలసుల గాంచి
ఘనవినీలాకాశంలో
తళుకులీను తారలు గదా !
అని మురిసిపోతి గదే ?                                                        II చిన్నీ II
అలనాడు నీ వోలె అల్పుడల్లె
అగుపించిన వామనుండు
బలిని ద్రొక్కెనంట పాతాళమునకు
నేను బలిని గాదె చీమిడీ
నన్ను బలి కోర వద్దే చీమిడీ
బుద్ధిగా మసలుకొందూనే
మంచూ, మంచూ, మంచూ జోలికి నేనెళ్ళనే
పిల్ల లేదు, చల్ల లేదు, అసలు గాలి ఊసే వద్దు

బుద్ధీ గా నడచుకొందూనే చీమిడీ                     II చిన్నీ II

013. కడిగిన ముత్యం


13. కడిగిన ముత్యం

దూరంగా......
భూమ్యాకాశాలు ఏకమయ్యే చోట
నల్లని చారలు.
చారలు కావవి
వర్షపు ధారలు.

ఆగిన వర్షం.
పయనం మొదలు పెట్టిన మేఘం
మబ్బు చాటు నుండి సూర్యుడు
బయటికి వచ్చాడు
కడిగిన ముత్యంలా............

(తిరుపతి నుండి నాయుడు పేట లోని మిత్రుడు నాగరాజు ఇంటికి వెళుతూ Bus లో నుండి కనిపించిన దృశ్యానికి స్పందన. స్పందన కి అక్షర రూపం, నెల్లూరు లో ని మరో మిత్రుడు వేణు ఇంట్లో...)



012. నేను ...........’నీ’గర్విని

12. నేను ...........’నీ’గర్విని

నీ అందమైన కనులను
కాపాడుతున్న కనురెప్పలను చూచి
నాకు అసూయ
అంత సామీప్యం నాకు లేనందుకు,
నీ పెదవులని చూచి
కూడా అదే భావన
సొగసైన చిరునవ్వుకు
సొంతదారు అయినందుకు.
గర్వించాను నేను
ఆ కనుపాపల నిండా
నేనున్నానని తెలిసి,
ఉప్పొంగాను నేను
ఆ చిరునవ్వు నా కోసం
విరబూసిందని తెలిసి.



011. ఓ వర్షం కురిసిన సాయంత్రం.......

11. వర్షం కురిసిన సాయంత్రం.......
నల్లని మబ్బులు
జోరున కురిపించిన వర్షం
నీవు నా పై కురిపించిన
ప్రేమ ముందు చిన్నబోయింది

గిలిగింతలు పెడుతూ
మెల్లగా వీచిన
చల్లటి గాలి
నీ వెచ్చటి ఊపిరిని ఎదిరించి
ఓడిపోయింది

శరీరాన్ని ఆవరించిన బడలిక
మనస్సుని ఆవరించిన నిరుత్సాహం
నీ చిరునవ్వుతో ఛిద్రమయ్యాయి

ప్రకృతి నీకు వశమైంది
పురుషుడు నీకు దాసోహమయ్యాడు

( సాయంత్రం చల్ల గాలిలో ఇంటికి వస్తున్నపిల్లవాడి కి వచ్చిన ఒక అందమైన ఊహ కి అక్షర రూపం)